Wednesday, June 17, 2009

సాయంత్రం నాలుగయింది.
శ్రీలత స్కూల్‌నుంచీ వచ్చింది. తన గదిలో పుస్తకాల సంచీని పడేసింది. డ్రెస్ మార్చుకుని మొహం కడుక్కొచ్చింది. కాళ్లీడ్చుకుంటూ వచ్చి నీరసంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూచుంది.పండ్ల ముక్కలు తినటం మొదలెట్టింది.
రోజువారీ దినచర్య ఇది.
"ఏంటి చిన్నీ అట్టా వున్నావ్?" అడిగింది మానస. ఆమె శ్రీలత తల్లి.
"ఏంలేదుగానీ డాడీ ఏమన్నారు?" ప్రశ్నించింది శ్రీలత.
సమాధానం చెప్పడానికి కళవళపడింది మానస. శ్రీలత ఆ విషయాన్ని సీరియస్‌గానే ఆలోచిస్తున్నదన్న మాట అనిపించింది. క్షణాల్లో తేరుకుని "కానీరా.. మట్లాడదాంలే. నీ ఉద్దేశం చెప్పావ్‌కదా. నేనూ చెప్పాను.ఆలొచిస్తార్లే. భయపడకమ్మా"అన్నది. ఆమె మాటల నిండా ఆప్యాయతా, కూతురి పట్ల శ్రద్ధ తొణికిసలాడేయి.
ఒకవైపు కూతురి పట్ల సానుభూతీ, మరోవైపు తనమీద తనకీ ఎక్కడలేని నిస్సహాయతా ఆవరిస్తోంది మానసకి.
భర్త సుందరం గురించిన ఊహే ఆమెని భయపెడుతోంది. తన పట్ల అతని భావాలూ, ప్రవర్తనా సరే తననొక ఆగర్భ శత్రువులా చూస్తాడు. అవును. సుందరంకి తనంటే చులకన. పెద్దగా చదువు రాదనీ, లౌక్యం తెలీదనీ, జీవితంలో 'యాంబిషన్'లేదనీ,అందంగా అలంకరించుకోలేదనీ, ఆకర్షణీయంగా, రొమాంటిక్‌గా కనిపించదనీ.. ఏమేమో సతాయిస్తూవుంటాడు. ఆ మాటలూ, ఆ మాటల ముగింపుగా వచ్చే చేష్టలూ,చేతలూ,శాడిజం -మానసిక, శారీరక హింస- వీటితో తాను తన 'ఖర్మ 'అనుకుని రోజులు గడుపుతోంది.
కానీ కూతురు పట్ల అతని ప్రవర్తన? పూర్తిగా వేరే కక్ష్యలో తిరుగుతోంది. నిండా ఎనిమిదేళ్లు నిండని ఆ పిల్లమీద అతనికి శతకోటి ఆశలు. ఆమె భవిష్యత్తు గురించి అనంతకోటి కలలు. శ్రీలత - లిమ్కా, గిన్నిస్ బుక్స్ రికార్డ్‌లు సాధించాలి. ఏషియన్ గేమ్స్‌లో వండర్ గర్ల్‌గా, ఒలింపిక్స్‌లో తెలుగు తేజంగా తనకి కీర్తి ప్రతిష్ఠలు తేవాలి. స్విమ్మింగ్‌లో ఏ విజయానికీ శ్రీలత దరిదాపుల్లోకి కూడా ఏ పిల్లా రాకూడదు. ఆ దిశగా సాగిస్తున్న సాధనలో ఇప్పటికే -ఎవరో అన్నట్లు- ఆ పిల్లని రాచిరంపాన పెడుతున్నాడు.
కూతురి గురించి మాట్లాడుతుంటే అతను నిజంగా ఎంతో అందంగా, సుందరంగా కనిపిస్తాడు. ఉంగరాలజుట్టు, బొద్దుముఖం, ముక్కుమీదికి జారే కళ్లజోడు, చురుకైన చూపులు- వీటితో సహజ మనోహరంగా ఉంటాడు.
'ఇంతటి మోహనరూపం లోలోపల అంత కర్కశహృదయాన్నెలా పెట్టాడో ఆ భగవంతుడు?' అనిపిస్తుంది తనకు!
శ్రీలత గురించి ఏ చిన్న విషయం చెప్తున్నా అతని చాతీ ఉప్పొంగుతుంది. మాటల్లో ఊపు వచ్చేస్తుంది. భాష ఉద్వేగభరితంగా మారుతుంది. 'నా కూతురు గోల్డ్' అంటాడు. ఎదురుగా ఉన్న తనతో 'నీలా సత్తుగిన్నె కాదు' అంటాడు.తనకు మనస్సు చివుక్కుమంటుంది. పొరపాటున తనేమన్నా అన్నదా చచ్చిందన్నమాటే. 'ఇవాళా రేపూ పనిమనుషులు కూడా నీకంటే బెటరే. చూడు ఆ బిర్రబిగిసిన కర్రజెడా, వదులు జాకెట్లూ'అని ఎటో వెళ్తుంది ఉపన్యాసం! అవే తనకి తిట్లూ,దీవెనలూ. ఇక ఆరాత్రి పతిదేవుని పవళింపు సేవలో తన శరీరం మీద అతని కసికసి దారుణ దౌర్జన్య కాండ!
పదేళ్లనుంచీ నిజానికి అతని ద్వారానే తాను బతుకు గురించి ఎంతెంత నేర్చుకున్నదో సుందరంకి తెలియదు. అతననుకుంటున్నట్టు తానొఠ్ఠి 'యూస్‌లెస్ ఫెలో'మాత్రం కానేకాదు.
మానసకి వాళమ్మ వైదేహి గుర్తుకొచ్చింది. ఆమె లెక్చరర్. తానొక్కతే సంతానం ఆమెకి. బతుకు భయం వలన ఎక్కువ చదువు కోసం వెంపర్లాడకుండా పెళ్లి చేసేసింది తనకు. తల్లి సంస్కారం అంతో ఇంతో లేదా తనకు? - తనను తాను ప్రశ్నించుకుంది మానస. సమాధానం 'ఉంది' అనే చెప్పుకుని దీర్ఘంగా ఊపిరితీసుకుంది.
మానస తన ఆలోచనల్లో తానుండగానే వచ్చాడు సుందరం. అతను రావడమంటే తుఫానొచ్చినట్టే. ఒకటే హడావుడి. అన్నీ అర్జంటు. ఓర్పు తక్కువ మనిషి.
"శ్రీ... వెళ్దామా? ఆర్ యూ రెడీ?" అంటూ కుర్చీలో కూచున్నాడు. కంగారుగా కదిలి, మంచినీళ్లిచ్చి, కాఫీ తేవటానికి లోపలికి వెళ్లబోయింది మానస.
"కాఫీ వద్దు. చూడు శ్రీని రమ్మను' అన్నాడు.
కూతురి గదిలోకి తొంగి చూసింది మానస. ఆపిల్ల చార్ట్‌మీద ఏదో బొమ్మ వేస్తోంది. తలతిప్పి చూసింది."నాకివాళ చాలా హోంవర్క్
వుంది."అన్నది కదలకుండా.
ఆమె సమాధానం విన్నాడు సుందరం."ఏంటి శ్రీ. నీకు చెప్తిని కదా. ఇవ్వాళ బుధవారం. వెళ్లాలి. ప్రోగ్రాం డేట్ దగ్గర పడుతున్నది. ప్రాక్టీస్ లేకపోతే కష్టం. ప్రతి నిముషమూ నీకు విలువైనదే. ఒక్క రోజన్నా మానకూడదు. పైగా కోచ్ నీకోసమే వస్తారు గదా ఇవ్వాళ? తప్పదమ్మా. ప్లీజ్. గెట్‌ రెడీ. గుడ్‌ గర్ల్" శాంతంగా అన్నాడు.
శ్రీలతలో ఉలుకూ పలుకూ లేదు. కూతురి దగ్గరగా వెళ్లి పక్కన నిలబడి,బుజం మీద చెయ్యివేసింది మానస.
శ్రీలత తలెత్తింది. ఆమె కళ్లనిండా ఉబుకిన కన్నీరు! గతుక్కుమంది మానస. మనసు గిజగిజలాడింది.
కళ్లు తుడించి చేత్తోనే సైగ చేసింది,"చా.. ఏడవకూడదు"అన్నట్టు.
"నాకు బాగాలేదమ్మా-నేను వెళ్లలేను."గొంతు బొంగురుపోయింది."పైగా హోమ్‌వర్కుంది. ఈ బొమ్మ స్కూల్ ఎగ్జిబిషన్‌కి రేపివ్వాలి" నెమ్మదిగా చెప్పింది. రాబోయే ఏడుపుని ఆపుకుంది.
నిమ్మళంగా హాల్లోకొచ్చింది మానస. "విన్నారుగా. ఇవ్వళ్టికి రాలేమని ఫోన్ చెయ్యండి కోచ్‌కి" అన్నది భర్తనుద్దేశించి.
సుందరంకి కోపమొచ్చింది. అతని చేతిలో పత్రిక విసురుగా వచ్చి మానస మొహం మీద పడింది.
"ఇదీ తమరి ఉచిత సలహా. బోడి సిఫారసు. రోజూ ఇట్టాగే ప్రాక్టీస్‌కి డుమ్మా కొట్తుంటే- నీలాగే పప్పు సుద్దయి కూచుంటుంది.స్కూల్ వర్క్ ఎప్పుడూ వుంటుంది. ముప్ఫై వేలు కట్టి ఆ క్లబ్‌లోనే కావాలని మెంబర్‌షిప్ తీసుకున్నది నా కోసమా? దానికోసమే. మనకిచ్చిన స్లాట్‌స్ మనం ఉపయోగించుకోవాలి. లేకపోతే వేస్ట్. కోచ్‌కిచ్చేదెంతో తెలుసా నీకసలు? నెలకి రెండు వేలు"
మానసకి మనసులో ముల్లు గుచ్చుకుంది. పిల్ల అభిరుచీ, కోరికా పట్టించుకోకుండా - ఇంతవరకూ బలవంతం చేస్తూ వచ్చాడు. చిన్నతనంలో ఎప్పుడో తాను స్విమ్మింగ్‌లో చాంపియన్ కావాలనుకుంటే పరిస్థితులూ,కాలం కలిసి రాలేదుట. అందుకని ఇప్పుడా కలనీ,ఆశనీ కూతురిద్వారా సాఫల్యం చేసుకోవాలని పట్టుదల మొండితనం!
"వొంట్లో బాగుండలేదంటే వినిపించుకోడేం. ఇదేం మనిషి?"అనుకుంది మానస.
తన ధోరణిలో తానున్నాడు సుందరం. విసుగూ, చిరాకూ, కోపం అన్నీ తన్నుకొచ్చినై ముందుకి.గట్టిగా అరిచాడు; "శ్రీ.. చెప్పేది నీకే. త్వరగా బయల్దేరు. కిట్ తీసుకో.. పద. టైమయిపోతోంది."
మానస మళ్లీ గదిలోకెళ్లింది. శ్రీలత విసురుగా కుర్చీలోనుంచీ లేచింది. కాళ్లు తట తటలాడిస్తూ, చేతులూగిస్తూ "నే వెళ్లనే అమ్మా" అన్నది. ఏడుపూ, ప్రాధేయపడటమూ రెండూ కాకుండా వచ్చినై మాటలు.
సుందరం అందుకున్నాడు,"ఏమొచ్చిందే నీకు. చెప్తుంటే అర్థం కావటం లేదా?" అంటూ దూకుడుగా గది దగ్గరికొచ్చాడు.
అతని మాటల్లాగానే కళ్లు ఆవిర్లు తేలుతున్నై. ఆవేశంతో ఉద్రేకపడుతున్నాడు. కొడతాడేమోనని భయపడింది మానస. పిల్ల వెనగ్గా నిలబడింది.
గది తలుపు మీద చెయ్యి ఆనించి నిలబడి అన్నాడు సుందరం,"ఇవాళ ఒకటో తేదీ. అవతల పదహారో తారీక్కు పోస్టర్లూ, బేనర్లూ తయారవుతున్నై. లిమ్కా వాళ్ల కన్‌ఫర్మేషన్ వచ్చేసింది. జింఖానా వాళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రోటరీ,లయన్స్,స్పోర్ట్స్ అథారిటీ వాళ్లంతా ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు నువ్విట్టా మొండికేస్తే అభాసుపాలయిపోతాం. నాకు తలకొట్టేసినట్టవుతుంది. చక్కగా... చెప్పిన మాట వినాలి శ్రీ. ఇదంతా రేపు నీ భవిష్యత్తు కోసం కాదూ?" అన్నాడు. చివరి మాటల్లో ప్రేమనీ, ప్రాధేయతనీ మిళితం చేశాడు.
"నాకిష్టం లేదసలు. నేను రాను." గట్టిగానే చెప్పింది శ్రీలత.
సుందరంకి షాక్! చేష్టలు దక్కిన వాడిలా నిలబడ్డాడు.
శ్రీలత వెళ్లి గోడవారగా వున్న తన మంచం మీద పడుకుంది.
తలవైపున ఉన్న పెద్ద టెడ్డీబేర్‌ని చేతుల్లోకి తీసుకుని గట్టిగా గుండెలకదుముకుని గోడవైపు తిరిగింది.
సుందరం స్పృహలోకొచ్చాడు. భారంగా కాళ్లీడ్చుకుంటూ హాల్లోకొచ్చి కూచున్నాడు. కూతురి మాట నచ్చలేదతనికి. మానస వైపు కసిగా చూశాడు.
" 'కూతురు చెడుగైన మాత తప్పు' అని ఇందుకే అన్నారు. నిక్షేపంలా ఉంది నీ పెంపకం. మొహం చూడు. అమాయకత్వమంతా తానే అన్నట్టు. నేనంటే భయపడి చస్తున్న దానిలా పోజు. కించిత్తు లక్ష్యం లేదు. మొండి ఘటాలు..." అని కుర్చీలోంచి లేచాడు. "నువ్వేం ఏడుస్తావో నాకు తెలీదు. ప్రోగ్రం జరక్క పోయిందో ...." ఆగి వేలు చూపాడు,'జాగ్రత్త' అన్నట్టు.
లేచి తన గది వైపు కదిలాడు.
- రాత్రి భోజనాలదగ్గర మళ్లీ అదే క్లాస్; అవే గద్దింపులు. ఇద్దరికీ బాగానే వడ్డించాడు.
తనకు ఇష్టం లేని పనిని తండ్రి ఎందుకు చేయమంటున్నాడో అర్థం కాలేదు శ్రీలతకు. అర్థమయ్యే వయసూ కాదామెది. అన్నంలో వేళ్లతో గీతలు గీసీ, అంకెలు వేసీ, రాతలు రాసీ- కెలుకుతూ కూచుని లేచి చెయ్యి కడుక్కుంది.వెళ్లి తన గదిలో పడుకుంది.
"ఈ అలగటాలకీ, కోపాలకీ తక్కువేం లేదు. ఎక్కడికి పోతయ్-అమ్మ బుద్ధులు?" అని ఒంటి కాలి మీద లేచాడు సుందరం, మానసపైకి.
వంటిల్లు సర్దుకుని పెళ్లి శ్రీలత పక్కన నడుం వాల్చింది మానస. పొట్ట మీద చెయ్యి వేస్తే, వొళ్లు కాలిపోతోంది పిల్లకి. కంగారు పడింది. లేచి నుదురూ, మెడా పట్టుకుని చూసింది. జ్వరం బాగానే వచ్చింది.
గది గడపదాకా వచ్చి భర్తకి వినిపించేటట్లుగా "పిల్లకి జ్వరమొచ్చింది" అని అల్మేరాలో వున్న టాబ్లెట్ తీసుకుంది.
"ఫర్వాలేదు. పడుకోనీ. పొద్దుటికి అదే సర్దుకుంటుంది" - ఇదీ సుందరం ప్రతిస్పందన.
భర్తకేసి అదోలా చూసి, పిల్లని లేపి టాబ్లెట్ వేసింది. లైట్ ఆర్పి తానూ పడుకుంది, కూతురి వెన్నుని లాలనగా నిమురుతూ.
- అర్థరాత్రి వేళ,
భార్యని భుజం తట్టి లేపాడు సుందరం. ఉలిక్కి పడి కళ్లు తెరిచింది మానస. ఎదురుగా సుందరం. "మాట్లాడాలి... రా" పిలిచాడు.
"రేపు మాట్లాడుకుందాం.. పడుకోండి"
"లేదు... ఇప్పుడే కావాలి..." చెయ్యి పట్టుకుని గుంజేడు. పక్కలో పిల్ల మసిలింది. అసలే ఆమెకి జ్వరం. తాను భీష్మిస్తే శ్రీలత లేస్తుంది. అయిష్టంగానే, చిరాగ్గా లేచింది. మంచం దిగింది. చీరె సర్దుకుని కదిలింది.
ఎదురుగా వున్న తమ గదిలోకి భార్యని లాగి తలుపేశాడు సుందరం.
మాట్లాడే విషయాలేం లేవు. అన్నీ పోట్లాడే విషయాలే.
"క్రితం సారి వన్ ప్లస్ వన్ కిలోమీటర్స్ రికార్డ్ అప్పుడూ ఇంత గలాటా చేసింది నీకూతురు. చచ్చీచెడి నా బలవంతాన పూర్తి చేసింది. ఇప్పుడు మళ్లీ అదే మారాం మొదలెటోంది. ఏమైనా తకరారొచ్చిందా ముందు నీ తాట వొలుస్తాను జాగ్రత్త" గట్టి హెచ్చరికే ఇచ్చాడు.
గొంతు పెగలుకుని, ధైర్యం కూడదీసుకుని చెప్పింది మానస, "చాలా సార్లు ఏడుస్తోందది. క్రితంసారి కూడా ఇట్టాగే చలి. నీళ్లల్లో దిగంగానే శరీరం కొంకరు పోయినట్లయి చాలా బాధ పడిందిట. పైగా మూడు కిలోమీటర్లు ఈదే శక్తి తనకు లేదని ఏడుస్తోంది".
"అదే చెప్తోంది నేను. నీ ఏడుపులాగానే అదీ నేర్చుకుంది. ప్రాక్టీస్ చేసి పాల్గొంటే అదే సాధిస్తుంది. రికార్డులనేవి కష్టపడకుండా రావు" అని "మాటలనవసరం. ఈ ప్రోగ్రామ్ జరిగి తీరాలి. నాకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లెమ్. ప్రిస్టేజి ఇష్యూ" అని టాపిక్‌ని క్లోజ్ చేశాడు.
ఆ తర్వాత అన్నీ నిస్సిగ్గుగా కాట్లాడే చేష్టలే; హెచ్చరికలూ, దైహికమైన చురకలూ.
పిల్లకి జ్వరంగా వున్నా, తనకి తప్పనిసరి 'చండాలప్పనికి' సిగ్గుపడుతూ, లోలోపల ఏడుస్తూ కుమిలిపోతోంది మానస. ఇటు- కాళ్లూ కళ్లూ తేలవేసి చూస్తూవుంది - రాత్రి!

* * * * *

వారం గడిచింది. తొమ్మిదో తేదీ వచ్చేసింది.
శ్రీలత ప్రోగ్రాంకి ఇంకొక వారమే వ్యవధి.
గడచిన వారమంతా ప్రాక్టీస్ లేదు. శ్రీలత మరీ మొండికేసి కూచుంది. సుందరం ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. కోపంతోనూ, ఆందోళనతోనూ అగ్గిబుగ్గయి పోతున్నాడు. చీటికీ మాటికీ తిట్లూ, అరుపులూ. మానసని కొట్టటం. ఈ రభసంతా చూసి శ్రీలత ఏడవటం. పక్క అపార్ట్‌మెంట్ వాళ్లు చాటుగా నవ్వుకోవటం.
ఇల్లు నరకమైంది.
మానస ఒక నిర్ణయానికొచ్చింది. ఖండితంగా చెప్పేసింది. నిండా ఎనిమిదేళ్లు లేని పిల్ల చేత మూడు కిలోమీటర్ల ఈత... పోటీ చేయించటానికి, అదీ సుందరం పేరు ప్రఖ్యాతులకోసం- తాను ఒప్పుకోనని కుండబద్దలు కొట్టింది. ఇది అతని అహం మీద పెద్ద దెబ్బగా తగిలింది.
సుందరం ఇంకా రెచ్చి పోయాడు. ప్రోగ్రాం జరక్కపోతే వచ్చే నష్టాలు తలచుకునీ, చెప్పీ కారాలూమిరియాలూ నూరసాగేడు.
రాత్రుళ్లు పళ్లు పటపటలాడిస్తూ - మానస మీద కసికసిగా దాడి! మొండిదనీ, మూర్ఖురాలనీ, దుర్మార్గురాలనీ, కూతురు భవిష్యత్తుని నాశనం చేస్తున్న రాక్షసి అనీ - కషగట్టి సాధింపూ, వేధింపూ సాగించాడు.
అప్పటికి మానసకి పూర్తిగా అర్థమైంది. తన వైవాహిక జీవితం తనకేమిచ్చిందో తెలిసొచ్చింది. అంతకు మించి, 'శ్రీలత అభిరుచీ, కోరికా విలువలేనివేనా?' అనే విచికిత్స మొదలైంది. ఆమెకిష్టం లేని పోటీని ఆమె మీద రుద్ది ఏం సాధించాలని ప్రయత్నం? అనే ప్రశ్న మొలకెత్తింది మేధలో.
'శక్తికి మించిన ప్రయత్నంలో అసలా పిల్లకేమైనా అయితే?' ఊహించలేకపోయింది! ఇది సాహసమా...? ప్రాణంతో చెలగాటమా-? సమాధానం చెప్పుకుంది. ఉన్నట్టుండి కళ్లు తెరిచి లోకాన్ని చూస్తున్నట్టనిపించింది మానసకి. మనసు తేలిక పడింది. ఆమెకేదో కొత్త శక్తి వచ్చినట్లనిపించింది.

* * * * *

ఆ వేళ,
సుందరం ఆఫీసుకి వెళ్లాడు. ఆ తర్వాతంతా చాలా బిజీగా వుంది మానస.
ఇంటికి వచ్చే వాళ్లు వస్తున్నారు, వెళ్లే వాళు వెళ్తున్నారు.
అంతా మీడియా వాళ్ల కోలాహలం, హడావుడీ!
ఒకపక్క శ్రీలత స్కూల్ మిసెస్ లావణ్య - మానవ హక్కుల సంస్థ వారితో మంతనాలు జరుపుతూ కావలసిన కాగితాలమీద తల్లీ కూతుళ్ల సంతకాలు తీసుకుంది. మహిళా సంఘాల కార్యకర్తలూ వచ్చారు.
చేయవలసినదంతా చేసి, అందరి దగ్గరా సెలవు తీసుకుంది మానస. సూట్‌కేస్‌లు తీసుకుని కూతురితో సహా ఆటో ఎక్కింది.
- ఆదరంగా, ఆప్యాయంగా కూతుర్నీ, మనవరాల్నీ లోపలికి తీసుకువెళ్లింది వైదేహి.
జరిగిన విషయాలన్నీ తెలిసినై వైదేహికి. తల్లీకూతురూ మనసులు కలబోసుకున్నారు. కళ్లనీళ్లు తుడూచుకున్నారు. "కన్నతల్లిగా నీ బిడ్డని నువ్ రక్షించుకోవటం నీ హక్కు. మంచి పని చేశావ్. దిగులు పడకు. నే ఉన్నానుగా" అని ధైర్యం చెప్పింది వైదేహి.
ఉన్నట్టుండి తల్లి ఊరడింపుకి కదిలిపోయింది మానస హృదయం.
అమ్మ ఒడిలో పడుకుని బావురుమంది మానస. దుఃఖాన్ని తమాయించుకోలేక పోయింది. వెక్కులు పెట్టింది.
"పిచ్చిపిల్ల"అని సానునయంగా కూతుర్ని దగ్గరికి తీసుకుంది - వైదేహి!
ఓ గంట తర్వాత,
ఇప్పుడు-
శ్రీలత తానువేసిన బొమ్మల కాగితాల దొంతరని ఒక్కటొక్కటిగా ఉత్సాహంగా అమ్మమ్మకి చూపుతోంది. వాటిలో దేనికి ఏఏ బహుమతి వచ్చిందో వివరంగా చెబుతోంది.
తృప్తిగా పరిశీఅలనగా కూతుర్నే చూస్తోంది మానస. చక్రాల్లాంటి కళ్లు తిప్పుతూ చిత్రంగా, సంబరగా, సంతోషంగా వున్న కూతురి కళ్లళ్లో అనంతమైన మెరుపుని చూసింది. తృప్తిగా మెరిసినై ఆమె కళ్లు కూడా.
బాల్కనీ దాకా నడిచి తలుపు తీసింది మానస.
దేహాన్ని తాకిన చల్లటి కమ్మతెమ్మెర ప్రాణానికి హాయినిచ్చింది!
ప్రకృతి చిత్రవర్ణాలతో పరవశిస్తోంది!

(నవ్య వీక్లీ 12/03/2008 సంచికలో ప్రచురితం)